ఏపీలో నేతల మాటల తీవ్రత పెరిగింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే లీడర్లు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు అధినేతలు చేస్తున్న విమర్శలకు ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ అధినేతపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 16వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా భీమవరంలో పర్యటించిన జగన్.. అక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. తన ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. అయితే ఈ సభలో పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ల మీద సెటైర్లు వేశారు. అయితే జగన్ చేసినఈ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వైఎస్ జగన్ మాట్లాడారని.. ఈ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జనసేన నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు ముకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. జగన్ వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోను కోరారు.