రాజకీయ పార్టీలు అప్ డేట్ అయ్యాయి. ఒకప్పటిలా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మాత్రమే నమ్ముకోవడం లేదు. సోషల్ మీడియాలోనూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక ట్రెండ్‌కు తగినట్లుగా ఎప్పటికప్పుడు తమ ప్లాన్ మారుస్తూ ముందుకెళ్తున్నాయి ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ ఫైటింగ్ జరుగుతోంది. వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక వార్‌ను వైఎస్సార్‌సీపీ మొదలెట్టగా.. జనసేన దానికి కౌంటర్లు వేస్తోంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వైసీపీ తొలుత ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ ఎక్స్‌లో ఒక క్వశ్చన్ పేపర్ షేర్ చేసింది. పేరు పవన్ కళ్యాణ్, తరగతి 12 ఫెయిల్, రోల్ నంబర్ 03 అని అందులో పేర్కొంది. క్వశ్చన్ పేపర్‌లో ఎందుకు రాజకీయాల్లో ఉన్నావ్? ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావ్? నీ రాజకీయ వ్యూహకర్త ఎవరు? నీకు ఇష్టమైనది ఏమిటి? చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిశావ్? మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. నాలుగోది ఎప్పుడు? అని వైసీపీ ప్రశ్నలు వేసింది. మరోవైపు.. వైసీపీ క్వశ్చన్ పేపర్‌కు కౌంటర్‌గా జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పేరుతో జనసేన ప్రశ్నాపత్రం రిలీజ్ చేసింది. దీనిని వైసీపీ ట్వీట్‌కి రిప్లైగా ఇచ్చింది.
పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తరగతి ఫస్ట్ క్లాస్, రోల్ నంబర్ 420 అంటూ అందులో రాసుకొచ్చింది. రాజకీయ వారసత్వం లేకుంటే జగన్ ఏం చేసేవాడు? కేసుల కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు తలవంచాడు? భారీ మెజారిటీ సాధించిన వైసీపీని ఓటమి దిశగా నడిపిందేవరు? ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? ఓడిపోయాక జగన్ ఏం చేస్తారు? అని ప్రశ్నలతో సెటర్లు వేసింది. ప్రస్తుతం ఈ రెండు క్వశ్చన్ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.