ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రాగన్‌పై గురిపెట్టి.. ఫిలిప్ఫిన్స్‌కు బ్రహ్మాస్త్రాన్ని అప్పగించిన భారత్.. ఇక ఆట మొదలు

international |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:29 PM

భారత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అనే సంగతి తెలిసిందే. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం వాటా మనదే. ఓ పాకిస్థాన్, మరో పక్క చైనా.. ఇంకో పక్క ఉగ్రవాదం నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కోవడానికి మన దేశం సైన్యాన్ని పటిష్టం చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. అందులో భాగంగానే రష్యా, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇన్నాళ్లపాటు ఆయుధాల దిగుమతులకే పరిమితమైన భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.


భారత్ తాజాగా తోటి ఆసియా దేశమైన ఫిలిప్ఫిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసింది. భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిస్సైళ్లను ఫిలిప్పిన్స్ మెరైన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్ శుక్రవారం ఫిలిప్పిన్స్‌కు చేరుకుంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పిన్స్ మధ్య 2022 జనవరిలోనే 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.


ఈ ఒప్పందంలో భాగంగా మూడు ఎక్స్‌పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిస్సైల్ వెపన్ సిస్టమ్‌లను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టమ్‌లో రెండు మిస్సైల్ లాంఛర్లతోపాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిస్సైల్ లాంఛర్ల నుంచి పది సెకన్ల వ్యవధిలో రెండు మిస్సైళ్లను ప్రయోగించొచ్చు. ఈ క్షిపణులను నేల మీది నుంచి మాత్రమే కాకుండా.. జలాంతర్గాములు, నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు భారత్ నుంచి ఫిలిప్పిన్స్ చేరాయి.


భారత్ ఆయుధాలను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం కాదు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్, ఆర్టిల్లరీ గన్స్, ఆకాశ్ మిస్సైళ్లు, రాడార్లు, పినాక రాకెట్లు, థర్మల్ ఇమేజర్లు తదితర చిన్న చిన్న ఆయుధాలను భారత్ ఇప్పటి దాకా ఎగుమతి చేసింది. కానీ ఫిలిప్పిన్స్‌తో కుదుర్చుకున్న బ్రహ్మోస్ ఒప్పదం భారత్‌కు అతిపెద్ద మిలటరీ ఎగుమతుల ఒప్పందమని చెప్పొచ్చు.


ఇది కేవలం ఆయుధాల ఎగుమతి.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి మాత్రమే పరిమితమైన ఒప్పందం కాదు. చైనాను నిలువరించే ప్రయత్నాల్లోనూ ఇదో ముందడుగు కానుంది. ఎందుకంటే.. చైనాకు సరిహద్దు వివాదాలు మన దేశానికే పరిమితం కాలేదు. దాదాపుగా పొరుగున ఉన్న అన్ని దేశాలతోనూ డ్రాగన్‌కు వివాదాలున్నాయి. ఇక దక్షిణ చైనా సముద్రం విషయంలోనైతే తైవాన్ నుంచి ఇండోనేసియా దాకా ఆ సముద్రంతో తీరం పంచుకుంటోన్న పలు దేశాలతో చైనాకు వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయం తర్వాత.. ఈ ప్రాంతంలో భారత్ నుంచి ఆయుధాల కొనుగోలుకు మిగతా దేశాలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది.


అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే పరిస్థితుల్లో లేదు. ఇక అమెరికా ఆయుధాల ధర చాలా ఎక్కువ. ఫ్రాన్స్ విషయంలోనూ ధర అవరోధంగా మారుతుంది. చైనా ఆయుధాల ధర తక్కువే అయినప్పటికీ.. వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకం. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని.. ఆయుధాలను ఎగుమతి చేసే టాప్-10 దేశాల్లో ఒకటిగా మారే దిశగా భారత్ అడుగులేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com