తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లి శుభలేఖను వినూత్నంగా తయారు చేశారు. నగరానికి చెందిన అలికాని సత్యశివకుమార్ (శివస్వామి), దుర్గాభవానీలు ఇలా వినూత్న ప్రయత్నం చేశారు. వారి వివాహ వేడుక ఈ నెల 21న అన్నవరం క్షేత్రంలో జరగనుంది. ఇందుకోసం బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ప్రచురించిన శుభలేఖ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. వీరు నిశ్చితార్థం నుంచి 16 రోజుల పండగ వరకు జరిగే సుమారు 45 ఘట్టాలను, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు.
వినాయకుని బియ్యం, ఆహ్వానపత్రిక, పందిరిరాట, పెండ్లికుమారుడు, కుమార్తెను చేయడం, స్నాతకము, కాశీయాత్ర, మధుపర్కం, భాషికములు, కన్యాదానం, షోడశదానములు, జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మబంధనం, అగ్నిసాక్షి, ఏడడుగుల బంధం, ఉంగరాల ఆట, అప్పగింతలు ఇలా అన్ని ఘట్టాలను అందులో పొందుపరిచారు. ప్రతి ఘట్టానికి ఒక క్యూఆర్ కోడ్ రూపొందించారు. కోడ్‌ను స్కాన్ చేస్తే ఆన్‌లైన్‌లో ఆ ఘట్టాన్ని ప్రతిఒక్కరూ వీక్షించేలా శుభలేఖను రూపొందించడం మరో విశేషం. ఈ పెళ్లి ఆహ్వాన పత్రిక అందర్నీ ఆకట్టుకుంటోంది.