లోక్‌సభ ఎన్నికల వేళ బెంగళూరులో నెలకొన్న నీటి సమస్య తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని నెలలుగా బెంగళూరులో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో బెంగళూరులో నివసించే టెకీలు తీవ్ర అవస్థలు పడ్డారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరవాసులు మొత్తం ట్యాంకర్లపై ఆధారపడ్డారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ బెంగళూరు నీటి కొరత అంశం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నీటి సమస్యపై తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు నీటి సంక్షోభాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. సిద్ధరామయ్య సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. నగర వాసులకు నిత్యం అవసరమైన నీటిలో సగం మాత్రమే వారికి అందాయని పేర్కొన్నారు. నీళ్లు దొరక్క ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయించారని.. కొన్ని ప్రాంతాల్లో ఆ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బెంగళూరు నగరాన్ని టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చిందని దుయ్యబట్టారు.
బెంగళూరు నగరాన్ని ట్యాంకర్ మాఫియాకు అప్పగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రైవేట్ రంగానికి వ్యతిరేకమని.. పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకమని.. సంపద సృష్టికి వ్యతిరేకమని తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఇండియా కూటమి కేవలం మోడీపైనే ఫోకస్ చేస్తుందని.. కానీ తన ఫోకస్ మాత్రం మొత్తం దేశం అభివృద్ధి పైనా, గ్లోబల్ ఇమేజ్‌పైనా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు అరిగిపోయిన టేప్ రికార్డర్‌తో తిరుగుతున్నారని.. ఎన్డీయే నేతలు మాత్రం ట్రాక్ రికార్డ్‌తో తిరుగుతున్నారని తెలిపారు. అందుకే బెంగళూరు నగరవాసుల ఆశీర్వాదం కోసం ఇక్కడి వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు బీజేపీకి పట్టున్న ఏకైక రాష్ట్రం బెంగళూరు కాగా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ.. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు రూరల్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్.. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. బెంగళూరు సెంట్రల్ నుంచి పీసీ మోహన్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పోటీ చేస్తోంది. ఈసారి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీలో ఉంది.