ప్రస్తుతం దేశంలో ఎన్నికల హోరు నడుస్తోంది. పార్టీలన్నీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే మేనిఫేస్టోలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని.. విపక్షాలు కోరుతున్నా.. తాము మాత్రం రిజర్వేషన్లను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రాజస్థాన్‌లోని కోటాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కోటా లోక్‌సభ అభ్యర్థిగా ఓం బిర్లాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని.. అందుకే వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా.. తాము అలా చేయం అని చెప్పారు. ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఓబీసీ వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని విమర్శించారు.
అంతేకాకుండా పార్లమెంటులో నిర్వహించిన చర్చలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు రిజర్వేషన్ల అంశంపై వ్యతిరేకంగా మాట్లాడారని అమిత్ షా గుర్తు చేశారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపు కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ప్రతి 3 నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ప్రియాంక గాంధీ వాద్రా థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చారని దుయ్యబట్టారు.
దేశ ప్రజలపై వారికి ప్రేమ లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు చొరబడి దాడులు చేసేవారని.. మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని చెప్పారు. అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ గత పదేళ్లలో నెరవేర్చామని వెల్లడించారు.