మన దేశంలో అత్యధిక మంది తమ రోజువారీ ప్రయాణానికి రైల్వేలపైన ఆధారపడుతూ ఉంటారు. నిత్యం కోట్లమంది దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో సాధారణంగానే రద్దీ ఉంటుంది. ఇక పండగల వేళ అయితే రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక రిజర్వేషన్ చేసుకుందాం అంటే.. వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ అంటూ పెద్ద లిస్ట్ ఉంటుంది. నెల, 2 నెలల ముందు టికెట్ బుక్ చేసుకున్నా.. సీటు దొరకడం చాలా కష్టం. ఇక జనరల్ కంపార్ట్‌మెంట్ల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.
నిత్యం రద్దీగా ఉండే రైళ్లలో ఈ జనరల్ కంపార్ట్‌మెంట్లలో ఊపిరి ఆడకుండా జనం ఉంటారు. బాత్రూమ్‌లు, డోర్ల వద్ద.. ఎక్కడ చూసినా చిన్న ఖాళీ లేకుండా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఏసీ కోచ్‌లలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏసీ కోచ్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రయాణికులకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు.. సోషల్ మీడియాలో ఉంచి.. రైల్వే శాఖ మంత్రిని ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది.
కాశీ ఎక్స్‌ప్రెస్‌లోని సెకండ్ ఏసీ కోచ్‌లోకి టికెట్ లేకుండా చాలా మంది ప్రయాణికులు ఎక్కి ప్రయాణించడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాష్‌రూంలోకి వెళ్లకుండా, డోర్ల వద్ద భారీగా జనాలు కూర్చోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆ సెకండ్ ఏసీ కోచ్‌లోని ఓ ప్రయాణికుడు.. అందులోని ప్రయాణికులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ‘‘టికెట్ లేని ప్రయాణికులు సెకండ్ ఏసీ కోచ్‌ని హైజాక్ చేశారని.. కనీసం వాష్ రూమ్‌లోకి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇక కోచ్ తలుపుల వద్ద నిలబడ్డారని.. డోర్లు కూడా తెరిచి ఉంచడంతో ఏసీ కూడా సరిగా పనిచేయలేదని ట్విటర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఆ వీడియోను ట్విటర్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. అశ్విని వైష్ణవ్ సార్.. దయచేసి 2 టైర్ ఏసీ పరిస్థితి చూడండి. భోజనం లేదు, నీరు లేదు. కనీసం బాత్రూం వెళ్లేందుకు కూడా మార్గం లేదు. ఏసీ అసలు పనిచేయడం లేదు. దయచేసి దీనిపై చర్యలు చేపట్టండి’’ అంటూ వేడుకున్నాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. దీంతో ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే సంబంధిత అధికారి డీఆర్ఎం భుసావల్‌ను సంప్రదించినట్లు రైల్వే సేవా తెలిపింది.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు.. తమకు రైలు ప్రయాణాల్లో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. జనరల్ కంపార్ట్‌మెంట్లు పెంచాలని కొందరు కోరారు. మరికొందరు అయితే రైల్వే శాఖ పనితీరు లోపం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టి కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లు తీసుకువచ్చేముందు.. దేశంలో ప్రస్తుతం ఉన్న రైలు సర్వీసులను పెంచండి అంటూ మరికొందరు సూచించారు.