బాల రాముడి దర్శనాలకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో నిలిపివేసిన వీవీఐపీ దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 20 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత మొదటిసారి నవమి ఉత్సవాలను నిర్వహించారు. దీంతో అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావించిన ఆలయ ట్రస్ట్.. ఏప్రిల్ 18 వరకు వీఐపీ దర్శనం, పాస్‌ల ద్వారా దర్శనాలను రద్దుచేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 18 వరకు స్లాట్‌లు బుక్ చేసుకున్న వారి పాస్‌లు సైతం రద్దయ్యాయి.
నవమవి వేడుకలు ముగిసినందున వీవీఐపీ దర్శనాన్ని మళ్లీ కల్పిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. విశిష్ట, సుగం దర్శనాలు అనే రెండు కొత్త విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పద్దతిలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రతి రెండు గంటలకు ఆరు వేర్వేరు స్లాట్‌లలో దర్శన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక దర్శనం కోసం ప్రతి స్లాట్‌లోనూ 100 పాస్‌లు జారీ చేస్తారు. వీటిలో 20 ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా.. మిగతా 80 పాస్‌లు ట్రస్ట్ ద్వారా అందిస్తామని అధికారులు తెలిపారు.
ఇక, బాలక్ రామ్ మంగళ, భోగ్, శయన్ హారతిలో పాల్గొనేవారికి పాస్‌లు ఇస్తారు. ప్రతి హారతికి 100 మందికి అవకాశం కల్పిస్తారు. పాస్‌లు జారీ చేస్తారు. ఇవి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా, అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామమందిర నిర్మాణం జరిగి.. ఈ ఏడాది జనవరి22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం తర్వాత జరిగిన మొదటి శ్రీరామనవమి వేడుకలు ఇవే. దీంతో భక్తుల జయజయధ్వానాలతో సాకేతపురి పులకరించింది. దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రామ్ లల్లా సుందర మనోహర రూపాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోయారు.