ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అటు.. నరేంద్ర మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.10 వేల కోట్లతో కొత్త ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తే.. మోదీ 3.0 లో భాగంగా తొలి వంద రోజుల్లో చేపట్టే ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 100 రోజుల ఎజెండాలో భాగంగా గృహ రుణాలపై వడ్డీ రాయితీ.. దేశంలో కొత్త నగరాలను ఏర్పాటు చేయడం, దివాలా ఆలస్యాన్ని తగ్గించడం వంటి ప్రతిపాదనలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చిస్తున్నట్లు.. సంబంధిత వర్గాల ద్వారా సమాచారం బయటికి వచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.10 వేల కోట్లతో 100 రోజుల ప్లాన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని మెట్రో నగరాల్లో జనాభా రద్దీని తగ్గించడంతోపాటు తయారీ, సేవల రంగాలను విస్తరించేందుకు దేశంలో మరో 10 కొత్త నగరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇవి ప్రస్తుతం చర్చల దశలోనే ఉండగా.. బయటికి వెల్లడించవద్దని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.10 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోని నగరాల్లో తయారీని పెంచడానికి, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై కసరత్తు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఇటీవల బీజేపీ మేనిఫేస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక హోం లోన్లు తీసుకునేవారికి కొత్త వడ్డీ రాయితీ అందించే పథకానికి సంబంధించి కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ప్రకటించారు. హోం లోన్లపై రాయితీ ఇవ్వడంలో మొదటి లక్ష్యం.. రియల్ ఎస్టేట్ రంగంలో మరింత వృద్ధిని సాధించడమేనని అధికారులు పేర్కొన్నారు. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేసే బడ్జెట్‌లో వీటికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దివాలా ఆలస్యాన్ని తగ్గించి.. వారి ఆస్తులను జప్తు చేసేందుకు దివాలా చట్టాన్ని సవరించనున్నారు. ఇక దివాలా కేసులను సత్వరమే పరిష్కారించడానికి దివాలా ట్రిబ్యునల్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ ఫైనాన్షియల్ హబ్ ద్వారా అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో నేరుగా షేర్లను లిస్ట్ చేయడానికి భారత కంపెనీలకు అవకాశాలు కల్పించేందుకు నిబంధనలను మరింత సులభతరం చేయనున్నారు. ఇక బ్రిటన్, ఒమన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడంపై దృష్టి సారించనున్నారు.
2035 నాటికి స్వదేశీ వాణిజ్య విమానాలను తయారు చేయడం కోసం పరిశ్రమను అభివృద్ధి చేయడం. భారత్‌కు సొంతంగా క్రెడిట్ రేటింగ్స్ కంపెనీని అభివృద్ధి చేసేందుకు బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. వాహనాల కాలుష్యంపై మరిన్ని సంస్కరణలు, మున్సిపల్ కార్పొరేషన్‌లను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి రాష్ట్రాలకు సూచనలు చేయడం చేయనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది ప్రధాని మోదీ కల. అయితే అధిక వృద్ధి రేట్లు లేకుండా 8 శాతం స్థిరమైన వృద్ధి సాధించడం కష్టమని ఆర్థికవేత్తలు చెబుతున్నా దాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకోనున్నారు.