శవాల మీద పేలాలు ఏరుకునే రకం అనే సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన గురించి వింటే మాత్రం సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణాలు లేని వ్యక్తి పేరు మీద లోన్ తీసుకుని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ఆటలు సాగలేదు. చనిపోయిన వ్యక్తిని వీల్‌చైర్‌లో తీసుకువచ్చిన మహిళ.. ఆయనతో లోన్ పేపర్లపై సంతకాలు చేయిస్తుండగా.. బ్యాంకు అధికారులకు దొరికిపోయింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
బ్రెజిల్‌కు చెందిన ఎరికా డి సౌజా వియెరా నూన్స్ అనే మహిళ.. తన మేనమామ 68 ఏళ్ల పాలో రాబర్టో పెన్షన్ తీసుకునేందుకు వీల్‌చైర్‌లో బ్యాంకుకు తీసుకొచ్చింది. అయితే బ్యాంకు లోపలికి రాకముందే పాలో రాబర్టో చనిపోయాడు. ఇకపోతే తన మామ పేరు మీద ఉన్న పెన్షన్‌తోపాటు ఆయన పేరు మీద లోన్ తీసుకునేందుకు ఆమె ఒక భారీ ప్లాన్ వేసింది. పాలో రాబర్టో బతికే ఉన్నాడని అందర్నీ నమ్మించింది. అతను చనిపోయాడనే విషయాన్ని దాచి.. బ్యాంకు లోపలికి తీసుకువచ్చి.. లోన్ పత్రాలపై సంతకం చేయించేందుకు ప్రయత్నించింది.
అయితే సంతకం చేయించే సమయంలో పాలో రాబర్టో ఏమాత్రం కదలకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. ఏంటని ఆరా తీయగా.. ఆయన పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డారని తెలిపింది. అయినా బ్యాంకు సిబ్బందికి అనుమానం పోలేదు. దీంతో ఆ మహిళను గట్టిగా బ్యాంకు అధికారులు నిలదీయడంతో అసలు విషయాన్ని మెల్లగా బయట పెట్టింది. తన మామ బ్యాంకులోకి రావడానికి ముందే చనిపోయాడని పేర్కొంది. ఇక ఈ తతంగం మొత్తం అక్కడ బ్యాంకులో ఉన్న ఇతర కస్టమర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్‌గా మారింది. చనిపోయిన వ్యక్తి పేరు మీద లోన్ తీసుకునేందుకు ప్రయత్నించిన ఆ మహిళపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.