జనసేన పార్టీకి ఇంత గతి పట్టడానికి కారణం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే అని జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి అన్నారు. వైసీపీలోకి చేరిన అయన మాట్లాడుతూ.... జనసేనకు మనుగడ లేకుండా చేసిన వ్యక్తి ఆయనే. కేవలం 21 సీట్లను జనసేనకు విదిల్చి.. ఆ పార్టీ తరఫున ఎవరు పోటీచేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే నిర్దేశిస్తే.. ఇక, ఆ పార్టీ ఎందుకు...? ఆ పార్టీ అధినేత ఎందుకు..? నాలాంటి యువకులు జనసేన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాం. యువతరానికి రాజకీయ అవకాశం లభించిందంటూ పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేశాం. అయితే, చంద్రబాబు దుష్టాలోచనకు మా ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఆయన ట్రాప్‌లోనే జనసేన పార్టీ అధినాయకత్వం పడిపోయింది. జిల్లాలో ఒక్క సీటు కూడా లేకపోతే.. ఆ పార్టీ మనుగడ ఎంతకష్టమో అందరూ అర్ధం చేసుకోవాలి. దాదాపు 6 ఏళ్లు కష్టపడి జిల్లాలో పార్టీని నడిపింది ఎందుకు..? నా కోసం ఇన్నాళ్లూ నాతోపాటు ప్రయాణించిన వారందరికీ జనసేన సీట్లు లేకపోవడంపై నేనేం సమాధానం చెప్పాలి..? అందుకే, విలువల్లేని చోట నేనుండకూడదని మనస్తాపంతో జనసేనను విడిచి బయటకు రావాల్సి వచ్చింది. పార్టీ వీడి వారం తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వైఎస్‌ఆర్‌సీపీ లోకి చేరాను అని తెలియజేసారు.