ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరంలో ఈనెల 22న జరిగే జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, నియోజకవర్గ జనసేన పరిశీలకుడు వట్టి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఆయా మండలాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. 22న ఏలూరులో జరిగే ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి, 23న జరిగే పత్సమట్ల ధర్మరాజు నామినేషన్ కార్యక్రమానికి మూడు పార్టీల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.