ప్రేమజంట పురుగు మందు తాగి ఆత్మహ త్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి మార్కాపురం మండలంలోని పిచ్చి గుంట్లపల్లి గ్రామంలో వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చిగుంట్లపల్లి గ్రామానికి చెందిన నారు వెంకటనాగేశ్వరి(20)కి తన మేనమామ కుమారుడితో పక్క గ్రామం ఇండ్ల చెరువులో ఆదివారం ఉదయం 8 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి కనిపించకుండా పోయింది. అదే సమయంలో గ్రామానికి చెందిన జక్కుల గోపి (22) కూడా మాయమయ్యాడు. వారిద్దరి మధ్య రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వారిద్దరు కనిపించకపోవడంతో అందరూ వెతుకులాడారు. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు గ్రామ శివారులో గొర్రెలదొడ్డి సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో విగతజీవులుగా పడి ఉన్న వారిద్దరిని గొర్రెలకాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వారు వెంకటనాగేశ్వరి, గోపీలను గుర్తించారు. కుమార్తె ఆత్మహత్య చేసుకొందని తెలిసి ఆమె తల్లిదండ్రులు నారు వెంకటసుబ్బారెడ్డి, సుబ్బలక్ష్మీ, వారి బంధువులు విషాదంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెను పెళ్లికూతురిని చేయాల్సిన సమయంలో ఇలా జరగడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పెళ్లి కోసం వచ్చిన బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. నాగేశ్వరి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. అలాగే గోపి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రమణయ్య, నాగమణి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. గోపీకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇంట్లో ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక జిల్లా వైద్యశాలకు తరలించారు.
![]() |
![]() |