వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా ప్రాణాలకు తెగించి మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు, సునీతకు దేవుడే రక్షణ అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలులో అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఎంత డ్రామా జరిగిందో అందరికీ తెలుసని, ఆ సమయంలో సీఎం జగన్ అడ్డుపడకుండా ఉండి ఉంటే వివేకా హత్య కేసులో నిందితులకు నేడు శిక్షపడి ఉండేదని చెప్పారు. అప్పుడు తాను, సునీత రోడ్డుపైకి రావాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది వాస్తవం కాదా? సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న విషయాలే మాట్లాడుతున్నాం. సీబీఐ వెల్లడించాకే హత్య ఎవరు చేశారన్నది తెలిసింది. ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని సునీత, నేను కొంగు పట్టుకుని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. వివేకానందరెడ్డి ప్రజాసేవలో బతికిన వ్యక్తి. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ గుర్తుకు రాలేదా?’ అని వైసీపీ నాయకులను ఆమె నిలదీశారు. ‘వివేకానందరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా కొనసాగారు. ఆయన సేవలను జగన్ అన్ని విధాలుగా వాడుకున్నారు. చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదు. వైసీపీ గూండాలు, మూకలకు మళ్లీ చెబుతున్నా.. వివేకా పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేసి మాట్లాడటం మానుకోవాలి’ అని షర్మిల హెచ్చరించారు.