ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు. ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించారు. నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ దేవినేని ఉమను వసంత కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. వసంత కృష్ణప్రసాద్ ఈరోజు తనను కలిశారని చెప్పారు. పార్టీ కోసం ఇద్దరం కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబును సీఎంను చేస్తామని దేవినేని ఉమ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర క్షేమం కోరే నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో అందరం కలిసి పని చేస్తామని దేవినేని ఉమ అన్నారు. ‘‘ మా క్యాడర్ అంతా వసంత గెలుపునకు పని చేస్తారు. వసంత నామినేషన్‌లో పాల్గొంటాం. చంద్రబాబు సీఎం అవగానే డెల్టాకు నీరు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’’ అని దేవినేని ఉమ అన్నారు.