అవినీతి పార్టీకి ఓట్లు వేయవద్దని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. సిద్ధం అని వస్తున్న దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, చీమకుర్తి, బాపట్ల జిల్లా అద్దంకిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సిద్ధం అని ఎక్కడకు బయలుదేరారని వైసీపీ నేతలను నిలదీశారు. ‘‘చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఆయనకు సిగ్గుండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మీరు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ ఐదేళ్లలో తట్టెడు మట్టి పోశారా? వైఎ్‌సఆర్ శంకుస్థాపన చేసి 60శాతం పూర్తిచేసిన వెలిగొండను పూర్తిచేయకుండాఇన్నాళ్లు గాడిదలు కాశారా? వైఎస్ వారసులమని చెప్పుకోవడానికి సిగ్గులేదా? తాగునీరు, సాగునీరు లేక ప్రకాశం జిల్లాలో ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి కోసం పేదలు, రైతులు వలసలు వెళ్తున్నారు. ఏటా జనవరిలో ఇస్తామన్న జాబ్ కేలెండర్ ఏమైంది?’’ అని ముఖ్యమంత్రిని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తెచ్చారని మండిపడ్డారు. రూ.8లక్షల కోట్లు అప్పు చేయడమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా అని ఎద్దేవా చేశారు. ‘ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే బాగా సంపాదించాడటగా... అన్ని కమీషన్లు ఈయనకేనట కదా... ఈయన మంచోడు అయితే ఇక్కడనుంచి ఎందుకు మార్చారు?’ అని ప్రశ్నించారు. ఇలాంటి చెత్త పార్టీలకు, ఓట్లు వేయడం అవసరమా? అని ప్రజలను షర్మిల ప్రశ్నించారు.