టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గుడివాడ ప్రజల తరపున ఎన్డీఏ బలపర్చిన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు. అశేషంగా తరలి వచ్చిన గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. తమ విజయం ఈ రోజుతో తేటతెల్లం అయిందన్నారు. గుడివాడ ప్రజల చైతన్యం ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలిసిందని తెలిపారు. ఉన్మాది పాలనలో దారుణ పరిస్థితుల్లో గుడివాడ ఉందని వ్యాఖ్యలు చేశారు. రోడ్లు లేవు... డ్రెయిన్లు లేవు... ఉపాధి... ఉద్యోగాలు లేవు.... కనీసం త్రాగునీరు కూడా లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు.