పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈసారి ఏపీలో హైఓల్టేజ్ పోరు నెలకొన్న నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉన్న స్థానం ఇది. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే దీనికి కారణం. మరోవైపు వైఎస్సార్సీపీ సైతం ధీటైన అభ్యర్థిని బరిలోకి దించింది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత అధికార పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పవన్ పోటీ చేస్తారని భావించారంతా. పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. కానీ చివరకు ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపారు.
మరోవైపు వంగా గీత 1983లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1995 నుంచి 2005 వరకు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె పని చేశారు. 2000 సంవత్సరంలో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో ఆమె కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు.
పిఠాపురం రూటే సెపరేటు..
పిఠాపురం నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. గత నాలుగు ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. 2004లో బీజేపీ నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు గెలవగా.. 2009లో పీఆర్పీ నుంచి వంగా గీత విజయం సాధించారు. 2014లో టీడీపీ రెబల్‌గా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ గెలవగా.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు గెలిచారు.
వర్మకు పట్టున్న నియోజకవర్గం..
పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంచి పేరుంది. నియోజకవర్గ ప్రజలకు ఆయన చేరువయ్యారు. అందుకే 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికీ ఆయన 47 వేల మెజార్టీతో గెలవగలిగారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో.. త్రిముఖ పోరులో వర్మ కేవలం 1036 ఓట్ల తేడాతో ఓడారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం వర్మ తిరిగి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సుమారు 15 వేల ఓట్ల తేడాతో ఓడారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి పిఠాపురంలో 28 వేల ఓట్లు పడ్డాయి.
2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వర్మ పిఠాపురంలో రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు, వర్మ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పి బుజ్జగించడంతో.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వర్మ అంగీకారం తెలిపారు. తమ్ముడి గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్న నాగబాబు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున అన్నీ తానే వ్యవహరిస్తున్నారు.
వైసీపీ స్పెషల్ ఫోకస్..
ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేనాని పట్టుదలతో ఉన్నారు. అయితే పిఠాపురంలో మరోసారి గెలవడంపై వైఎస్సార్సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మండలాల వారీగా కీలక నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలు బాధ్యతలను కన్నబాబుకు అప్పగించగా.. యు.కొత్తపల్లికి దాడిశెట్టి రాజాను, పిఠాపురం పట్టణానికి మిథున్ రెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23న పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు వంగా గీత ఏప్రిల్ 22న నామినేషన్ వేశారు. వంగా గీత పేరు మీద రూ.2.10 కోట్ల చరాస్తులు ఉండగా.. ఆమె భర్త పేరిట రూ.27.81 లక్షలు ఉన్నాయి. గీత పేరిట రూ.13.11 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. ఆమె భర్త పేరిట రూ.13.64 కోట్ల మేర స్థిరాస్తులు ఉన్నాయి. వంగా గీత పేరిట రూ.4.51 కోట్లు, ఆమె భర్త పేరిట రూ.51.64 లక్షల మేర అప్పులున్నాయి.