ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు కొనసాగుతోంది. ఈ కేసులో నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్.. అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు మరోసారి షాక్ తగిలింది. వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని పొడగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మరో 14 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు. మే 7 వ తేదీన కేజ్రీవాల్, కవితలను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21 వ తేదీన ఈడీ అధికారులు.. తనను అరెస్టు చేయాడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 15 వ తేదీన విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై ఈడీని వివరణ కోరింది. ఈడీ అధికారులు వివరణ ఇచ్చేవరకు కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే కస్టడీ ముగియడంతో విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా.. కేజ్రీవాల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. మే 7 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఇక తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌ను జైలులోని చంపేసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ బాగా పెరుగుతున్నాయని.. ఇన్సులిన్ ఇవ్వాలని.. ఆయన, ఆప్ నేతలు కోరగా.. తీహార్ జైలు అధికారులు అవసరం లేదని చెప్పారు. ఇక కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. అయితే ఆయనకు మెడికల్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు.. షుగర్ లెవల్స్ 320 వరకు పెరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయనకు సోమవారం రాత్రి ఇన్సులిన్ అందించారు.