సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, అక్కడ నుంచి పోటీలో మిగతావారు తప్పుకోవడంతో బీజేపీ నేత ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. అయితే, సూరత్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన నీలేష్ కుంభానీ అదృశ్యమయ్యారని, ఆయను ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని స్థానిక మీడియా నివేదించింది. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసకు దిగారు. తాళం వేసి ఉన్న ఆయన ఇంటికి ‘ప్రజా ద్రోహి’ అనే పోస్టర్లును అతికించారు.
మరోవైపు, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికను వాయిదా వేసి నామినేషన్ ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేసింది. గుజరాత్‌లో అధికార బీజేపీ భయపెట్టి, అభ్యర్థులను ప్రభావితం చేస్తోందని ఆరోపించింది. ‘ఈ రకమైన తప్పుడు అనుచిత ప్రభావాన్ని ఉపయోగించుకోలేరనే స్పష్టమైన సందేశాన్ని పంపడానికి సూరత్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని, ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని కోరాం’ అని ఈసీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి అన్నారు. సూరత్ కాంగ్రెస్ అభ్యర్ధి కుంభానీ నామినేషన్‌ను నలుగురు ప్రతిపాదించారు. కానీ, హఠాత్తుగా నలుగురు సంతకాలు తేడాలున్నాయని నామినేషన్ తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
‘ఇది యాదృచ్చికంగా జరిగింది కాదు.. అభ్యర్థి కొద్ది గంటల పాటు కనిపించకుండా పోయారు.. మళ్లీ బయటకు వచ్చే సమయానికి ఇతరు అభ్యర్థులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మేము గుర్తించాం... ఆయన అభ్యర్థిత్వాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు’ అని సింఘ్వీ అన్నారు. కాగా, ఏప్రిల్ 18న కాంగ్రెస్ పార్టీ తరఫున నీలేశ్ కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన్ను ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ అంటూ మర్నాడు బీజేపీ కార్యకర్త దినేశ్ జోధానీ ఆరోపించారు.
ఇక, ఏప్రిల్ 20న కుంభానీ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకాలు తమవి కాదంటూ ప్రతిపాదించిన వ్యక్తులు అఫిడవిట్ సమర్పించారని పోలింగ్ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా పోలిసంగ్ అధికారి.. ఒక్క రోజులో తమకు సమాధానం ఇవ్వాలని కుంభానీనీ ఆదేశించారు.
కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి మద్దతుగా అభ్యర్థి, అతని ప్రతిపాదకులు రాకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఏప్రిల్ 21న నామినేషన్‌ను రద్దు చేశారు. కాంగ్రెస్ నేత ఇద్దరు సన్నిహిత బంధువులతో సహా ప్రతిపాదకులు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్ 22: నామినేషన్ ఉపసంహరణ చివరి రోజున బీఎస్సీ, స్వతంత్రులు సహా ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.