సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణించే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తూ ఉంటారు. ఏదైనా అనుమానిత వస్తువు గానీ.. నిషేధిత వస్తువులు గానీ కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటారు. అయితే ఓ ప్రయాణికుడి బ్యాగ్ చెక్ చేయగా.. అందులో నూడుల్స్ ప్యాకెట్లు ఉన్నాయి. అయితే ముందుగా అవి నూడుల్స్ ప్యాకెట్లేనని భ్రమ పడిన అధికారులకు వాటిని ఓపెన్ చేయగా.. అసలు విషయం తెలిసింది. ఆ నూడుల్స్ ప్యాకెట్లలో కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. అవి చూసి కస్టమ్స్ అధికారులే నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది.
ముంబై ఎయిర్‌పోర్టులో మొత్తం రూ.4.44 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారం.. రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నూడుల్స్ ప్యాకెట్లలో, శరీర భాగాల్లో దాచి.. దొంగతనంగా వెళ్తుండగా.. కస్టమ్స్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. మొత్తం విలువ రూ.6.46 కోట్ల విలువైన వజ్రాలు, బంగారంను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబై నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణిస్తున్న ఓ భారత ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులో ఉన్న నూడుల్స్ ప్యాకెట్లలో బంగారం, వజ్రాలను గుర్తించారు. దీంతో ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
ఇక మరో ఘటనలో విదేశీ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలోని కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ దగ్గర నుంచి 321 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ముక్కలు ముక్కలుగా చేసి.. ఆ మహిళ తన లో దుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. ఆమెను తనిఖీ చేయగా.. బంగారం బయటపడింది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లే కాకుండా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ ఇలా వివిధ దేశాలకు ప్రయాణించే.. వివిధ దేశాల నుంచి ముంబైకి వచ్చిన 10 మంది నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.