ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద.. చెల్లెలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాటల దాడి కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మేమంతా సిద్ధం సభలో మంత్రి బొత్స సత్యనారాయణను తండ్రిలాంటి వారంటూ సీఎం జగన్ సంభోదించారు. వేదిక మీద అభ్యర్థులను ప్రకటించే సమయంలో.. బొత్సను పిలిచిన వైఎస్ జగన్.. తనకు తండ్రిలాంటి వారని చెప్పారు. దీంతో మంత్రి బొత్స కూడా భావోద్వేగానికి గురయ్యారు. వేదిక మీద చిన్నాపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బొత్స గురించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. బొత్సను జగన్ తండ్రిసమానులు అని పిలవడాన్ని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినవారు తండ్రి సమానులు ఎలా అయ్యారంటూ జగన్ మీద సెటైర్లు వేశారు.
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలను షర్మిల తప్పబట్టారు. "బొత్స సత్యనారాయణ.. జగన్ మోహన్ రెడ్డిగారికి తండ్రి సమానులంట. అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన బొత్స సత్యనారాయణ.. జగన్‌కు తండ్రి సమానులంట.. ఇదే బొత్స వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాగుబోతన్నారు, వైఎస్ జగన్‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. చివరకు వైఎస్ సతీమణి విజయమ్మను సైతం అవమానించిన ఈ బొత్స.. జగన్‌కు తండ్రిసమానులు అయ్యారంట. జగన్ క్యాబినెట్లో ఉన్నవాళ్లు అందరూ వైఎస్ఆర్‌ను తిట్టిన వాళ్లే. బొత్స, పెద్దిరెడ్డి, విడదల రజినీ, రోజా ఇలా అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినవాళ్లే. వైఎస్‌ను తిట్టినవాళ్లకే జగన్ పెద్దపీట వేశారు. ఇప్పుడు వీళ్ళందరూ తండ్రులు,అక్కలు,చెల్లెల్లు" అని షర్మిల విమర్శించారు.
"వైఎస్ జగన్ కోసం నిజంగా పని చేసిన వాళ్ళు ఆయనకు ఏమీ కారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారు. ఆయన కోసం పనిచేసి గొడ్డలిపోటుకు గురైన వాళ్ళు ఏమి కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయి రెడ్డి ,R అంటే రామకృష్ణారెడ్డి.10 ఏళ్లలో రేపల్లెలో అభివృద్ధి జరిగిందా? ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా ? జగన్ గారు ఇక్కడకు వచ్చారట. హామీలు ఇచ్చారట. చెక్ డ్యాంలు కట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట .100 పడకల ఆసుపత్రి అన్నారట. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు" అని షర్మిల విమర్శించారు.