ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను విజయవాడ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్డు.. సతీష్‌ను మూడురోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సతీష్‌ను లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని స్పష్టం చేసింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సతీష్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది.
సతీష్ ప్రస్తుతం విజయవాడ జైలులోనే ఉన్నారు. కోర్టు తీర్పుతో ఏప్రిల్ 27 వరకూ సతీష్ పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఇక రేపటి నుంచి మూడురోజుల పాటు సతీష్‌ను పోలీసులు విచారిస్తారు. అయితే విచారణ సమయంలో థర్డ్ డిగ్రీని ఉపయోగించకూడదని విజయవాడ కోర్టు స్పష్టం చేసింది. విచారణ పూర్తైన తర్వాత విచారణ అంశాలను తమకు తెలియజేయాలని ఆదేశించింది. సీఎం వైఎస్ జగన్ మీద రాళ్లదాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో సతీష్ ఏ వివరాలు చెప్తాడనేదీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 13వ తేదీ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. అయితే సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఆగంతకుడు రాయి విసరగా.. జగన్ ఎడమ కన్ను పైభాగంలో తగిలి గాయమైంది. అదే రాయి పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం తగలగా.. ఆయనకు గాయమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనపై వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా అజిత్ సింగ్ నగర్ సమీపంలోని వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
సతీష్ తన జేబులో నుంచి పదునైన కాంక్రీట్ రాయిని తీసి జగన్ మీదకు విసిరినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సతీష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం సతీష్ విజయవాడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించడంతో ఏప్రిల్ 27 వరకూ సతీష్ జైళ్లోనే ఉండనున్నారు.