ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఏపీ హైకోర్టులో వాలంటీర్లకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలంలో వేలసంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు, అయితే వీరి రాజీనామాలను ఆమోదించవద్దంటూ భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్లనే ఎన్నికలు పూర్తయ్యే వరకూ వారి రాజీనామాలు ఆమోదించవద్దని రామచంద్రయాదవ్ కోరారు.
ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళ, బుధవారం విచారణ జరిపింది. మంగళవారం నాటి విచారణలో ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో తెలియజేయాలంటూ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేయగా.. ఇవాళ్టి విచారణలో ఎంతమంది రాజీనామా చేశారనే దానిపై ఎన్నికల సంఘం అధికారులు వివరాలు సమర్పించారు. ఇప్పటి వరకు 62 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. వీరిలో 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచినట్లు చెప్పారు.
మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే.. వారంతా అధికార పార్టీకి అనుకూలంగా, వైఎస్ జగన్‌కు మద్దతుగా వ్యవహరిస్తారని పిటిషనర్ తరుఫు న్యాయవాదులు వాదించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగించి.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.