ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో పార్టీలు, అభ్యర్థులు.. తీవ్ర ఎండలోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక విపరీతమైన ఎండ వేడిమి ఉన్నా.. జనం మాత్రం రాజకీయ పార్టీల సభలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ఎన్నికల సభలో పాల్గొన్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగం మధ్యలోనే స్పృహ కోల్పోయి పడిపోతుండగా.. పక్కనే ఉన్న వారు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఓ సభలో వేదికపైనే నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురి కావడం గమనార్హం.
66 ఏళ్ల నితిన్ గడ్కరీ.. ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అయితే తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నాగ్‌పూర్ నియోజకవర్గంలో ఓటింగ్ పూర్తయింది. అయితే ఎన్డీఏ కూటమి నేతల తరఫున.. నితిన్ గడ్కరీ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని యవత్మాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. యవత్మాల్-వాశిమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ- ఏక్‌నాథ్ షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి తరఫున నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
యవత్మాల్-వాశిమ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రాజశ్రీ పాటిల్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతు గురయ్యారు. ప్రసంగం మధ్యలోనే కిందపడిపోతుండగా.. గమనించిన నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను పడిపోకుండా పట్టుకున్నారు. అనంతరం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నితిన్ గడ్కరీ.. విపరీతమైన ఎండ, ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ ఘటన తర్వాత నితిన్ గడ్కరీ ఒక ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల సభలో భాగంగా ఎండ వేడిమి కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కానీ ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా తర్వాత ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వరుద్‌కు బయలుదేరుతున్నట్లు ఆ ట్వీట్‌లో వెల్లడించారు. తాను అస్వస్థతకు గురైనట్లు తెలిసి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు చూపించిన ఆప్యాయత, శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతంలో కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఇలాగే సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. కోలుకున్నారు.