సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని ఎదురుచూస్తారు. ఇక పదో తరగతి విద్యార్థులకు.. పై చదువుల కోసం ఆ రిజల్ట్స్ కీలకం. అందుకే పదో తరగతి రిజల్ట్స్ వస్తున్నాయంటే విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అయితే కొందరు పాస్ కూడా కాలేదని బాధపడితే.. మరికొందరు మాత్రం ఆశించినంత మంచి మార్కులు రాలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తారు.
ఇక పాస్ అయితే చాలు రా బాబు.. అనుకునే విద్యార్థులు కూడా ఉంటారు. అలాంటివారికి ఊహించిన దాని కన్నా ఎక్కువ మార్కులు వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఆనందం ఎక్కువైతే కూడా అది అనర్థానికే దారి తీస్తుంది అనేదానికి ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మీరట్‌లోని మోడీపురం గ్రామంలోని మహర్షి దయానంద్ స్కూలులో చదువుతున్న 16 ఏళ్ల అన్షుల్ కుమార్‌కు 10 వ తరగతి ఫలితాల్లో ఏకంగా 93.5 శాతం మార్కులు వచ్చాయి.
అయితే అన్ని మార్కులు వచ్చిన ఆ విద్యార్థి ఆనందంతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అన్షుల్ కుమార్‌ను ఐసీయూకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అన్షుల్ కుమార్ తండ్రి సునీల్ కుమార్.. పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బోర్డ్ 10 వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 10 వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.