ఆంధ్రప్రదేశ్‍లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య మీద ఓ స్పష్టత వచ్చింది. ఏపీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీతో ముగిసింది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. అయితే శుక్రవారమే పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ఆలస్యమైంది. దీంతో శనివారం వరకూ కొనసాగింది. అయితే నామినేషన్లు పెద్ద సంఖ్యలోదాఖలు కావటంతోనే స్క్రూటినీకి సమయం పట్టినట్లు అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకుమొత్తం 686 నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 686 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే 686 నామినేషన్లలో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. ఇక వివిధ సాంకేతిక కారణాలతో 183 నామినేషన్లను తిరస్కరించారు. లోక్ సభ స్థానాలకు సంబంధించి అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి మొత్తం 3,644 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 3 వేల 644 నామినేషన్లలో ఎన్నికల పరిశీలన తర్వాత 2,705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. వివిధ కారణాలతో 939 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ గడువు ఉంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారు, ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన తర్వాత అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఏపీ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన ప్రకటిస్తారు.