ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పోలింగ్‌కు సమయం దగ్గపడుతుండటంతో పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు. డొక్కా శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీకి డొక్కా రాజీనామా చేశారు. నాలుగేళ్ల తర్వాత ఆయన తిరిగి టీడీపీలో చేరడం విశేషం. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించింది. దీంతో గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా పార్టీకి గుడ్ బై చెప్పారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో డొక్క టీడీపీ చేరారు.. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు.. అయితే కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ హైకమాండ్ తీరుతో డొక్కా మాణిక్య వరప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. టికెట్ కేటాయింపు, ప్రాధాన్యం లేకపోవడంతో అంటిముట్టనట్టుగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా ఉన్నారు. పార్టీ, సీఎం జగన్ తీరుతో విసుగుచెంది ఈ రోజు ఉదయం రాజీనామా చేశారు. సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.