ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పండుగ కొనసాగుతోంది. ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఓటు హక్కు ఎంత విలువైందో ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. పోలింగ్ రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నాయి. ఇలా అయినా అంతా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం ఇచ్చిన సెలవు రోజున ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడమో లేక బయట తిరగడమో చేస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఓ బామ్మ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసింది. అది కూడా న్యుమోనియాతో బాధపడుతున్నప్పటికీ.. ఆక్సిజన్ పెట్టుకుని అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని జయానగర్‌కు చెందిన 78 ఏళ్ల కళావతి అనే వృద్ధురాలు ప్రస్తుతం న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బెంగళూరులో పోలింగ్ జరగ్గా.. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని అంబులెన్సులో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
ఇటీవల కళావతి తీవ్ర దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న మణిపాల్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా.. న్యూమోనియాగా నిర్ధారించారు. దీంతో కళావతికి ఆక్సిజన్ థెరపీతోపాటు యాంటీబయోటిక్స్ అందించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే ఇంత అస్వస్థతకు గురైన కళావతి.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పట్టుబట్టారు. అయితే ఆస్పత్రిలో ఉన్న కళావతి.. ఈ విషయాన్ని డాక్టర్లతో చెప్పడంతో వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కళావతిని జయానగర్‌లోని పోలింగ్ కేంద్రానికి అంబులెన్సులో.. ఆక్సిజన్ మాస్క్ పెట్టి తీసుకెళ్లారు.
నర్సుల సహాయంతో స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్‌లోకి వెళ్లి.. ఓటు వేశారు. బయటికి వచ్చిన తర్వాత తన వేలుకు ఉన్న సిరాను చూపుతూ కళావతి సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఆ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఆ వృద్ధురాలిని చూసి ప్రశంసించారు. ఆస్పత్రిలో లేవలేని స్థితిలో ఉండి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న కళావతిని విషయం తెలిసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ బామ్మను చూసైనా.. ఇంట్లో కూర్చున్న వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.