ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నెలకొన్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఒకే పార్టీ విజయం కోసం పనిచేసిన వారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి తలపడుతున్నారు. అందులో మొదట వినిపించే పేర్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల. 2014, 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచిన షర్మిల, ఆమె కుటుంబం ప్రస్తుతం.. ప్రత్యర్థులుగా మారిపోయారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు.. వైఎస్ వివేకా హత్యకేసు అంశం కారణంగా వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల భర్త, బ్రదర్ అనిల్ కుమార్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కడపలోని రాజారెడ్డి వీధిలో ఆయన పర్యటించారు. ఓచర్చిని సందర్శించిన అనిల్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదని, ధైర్యంగా ఎదుర్కోవాలని అనిల్ కుమార్ సూచించారు. తామంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ భయపడకండి.. ఏసుప్రభు అండగా ఉన్నాడని, పాపాలను చేసిన వారిని తొక్కిపడేయండి అంటూ పిలుపునిచ్చారు. దేవుని మీద విశ్వాసం ఉంచి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరోవైపు 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వైసీపీ తరుఫున సిట్టింగ్ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే కడప రాజకీయం ఆసక్తికరంగా మారిపోయింది. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగాఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. నిందితులను చట్టసభలకు పోనివ్వకూడదనే ఉద్దేశంతోనే తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడి నుంచి కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. వైఎస్ కుటుంబం చీలిపోయింది.
వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకా కూతురు సునీత సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షర్మిలను గెలిపించాలని కోరుతున్నారు. అటు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్‌కి మద్దతుగా వైఎస్ షర్మిల మేనత్త విమలారెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఇద్దరు ఆడపిల్లలు వైఎస్ కుటుంబం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. జగన్, అవినాష్ రెడ్డి మీద విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇదిలా ఉన్న సమయంలోనే వైఎస్ జగన్ కూడా.. షర్మిల, సునీతలపై వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పచ్చచీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లేవారు.. వైఎస్ వారసులా అంటూ పులివెందుల సభలో జగన్ చేసిన విమర్శలు కడప రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. ఈ పరిస్థితుల్లో పాపులను తొక్కేయండి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.