ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ముస్లిం రిజర్వేషన్లు. తెలంగాణలో ఇటీవల పర్యటించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా.. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. అయితే ఈ అంశం అటు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు. ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఈ విషయం తెలుసని చెప్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఇటీవలే చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన పీయూష్ గోయెల్.. ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబుతో చర్చించిన తర్వాత గోయెల్ ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామని స్టేట్ మెంట్ ఇచ్చారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య ముస్లిం రిజర్వేషన్ల అంశంలో తమ స్టాండ్ ఏంటనేదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో మైనారిటీ వర్గాలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటనేదీ వెల్లడించారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్న చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే హజ్ హౌస్ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చెప్పారు. ఐదేళ్లలో వైసీపీ ఒక్క మసీదైనా కట్టిందా అని ప్రశ్నించారు. అలాగే ముస్లిం రిజర్వేషన్ల అంశంలో రెండో ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
"ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లు జగన్ ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? సీఏఏ, ఎన్ఆర్‌సీ బిల్లులు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు వైసీపీకి ఎవరికి సపోర్ట్ చేసింది? ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి సంతకం చేసి, రాజ్యసభలో మాట్లాడారు. ఆ చట్టాలను సమర్థించారు. ఇప్పుడేమో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని నాటకాలు ఆడుతున్నారు. చేసేవి తప్పుడు పనులు, మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు. మాట్లాడితే నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తారు, మసీదులు కూల్చేస్తారని తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను. ఐదేళ్లలో ఒక్క మసీదైనా కట్టించావా. 2014 నుంచి ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉంది. గతంలో కూడా టీడీపీ లాయర్లను పెట్టి ముస్లిం రిజర్వేషన్ల మీద వాదించింది. ముస్లింలలో కూడా పేదరికం ఎక్కువ ఉంది. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో రెండో ఆలోచన లేదు. వాటిని కాపాడే ప్రయత్నం చేస్తాం." అని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.