నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత మతుకుమిల్లి శ్రీభరత్ టీడీపీ కూటమి తరఫున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019లోనూ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసిన భరత్.. త్రిముఖ పోటీలో 4 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది. మరోసారి అధికారంలోకి వస్తే.. విశాఖ నుంచే తాను పరిపాలన సాగిస్తానని సీఎం జగన్ కూడా ప్రకటించారు. దీంతో విశాఖ ఓటర్లు తమవైపు మళ్లుతారని అధికార పార్టీ ధీమాతో ఉండగా.. ఈసారి విజయం తననే వరిస్తుందని భరత్ కూడా ధీమాతో ఉన్నారు. విశాఖ రాజధాని నగరమా కాదా అనేది నగరవాసులు పట్టించుకోరని.. అభివృద్ధిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని భరత్ తెలిపారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన భరత్.. ప్రత్యర్థులను సైతం వ్యక్తిగతం టార్గెట్ చేయకుండా.. అంశాల వారీగా విబేధించడానికే ప్రాధాన్యం ఇస్తారు.
ఇక రాజకీయాలు, ఎన్నికల విషయాన్ని పక్కనబెడితే.. తన మామ బాలయ్య గురించి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వమన్న భరత్.. ఆయన డ్రింకింగ్స్ హాబిట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మేన్షన్ హౌస్ బ్రాండ్ మందు తాగుతారని తమకు తెలుసన్న భరత్.. దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్నారు. బాలయ్యే వల్లే మాన్షన్ హౌస్ వాల్యూ పెరిగిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు.
బాలయ్య మాన్షన్ హౌస్ మందును వేడి నీళ్లలో కలుపుకొని తాగుతారంటూ భరత్ కొత్త విషయం చెప్పారు. బాలయ్యతోపాటు ఓ బ్యాగ్‌లో హాట్ వాటర్, బాటిల్‌ను ఆయన వెంట తీసుకెళ్తారన్న భరత్.. అమెరికా వెళ్లినా తీసుకెళ్తారన్నారు. ఆ బ్రాండ్‌కు మామయ్య చాలా లాయల్ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. స్ట్రీట్ బైట్ రవి తేజకు భరత్ ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలయ్య కుటుంబంతో తమ కుటుంబానికి చాలా కాలంగా పరిచయం ఉందని భరత్ తెలిపారు. ‘‘అత్తయ్య వసుంధర, మా అమ్మ, పెద్దమ్మ.. వీళ్లంతా సికింద్రాబాద్‌లోని ఒకే బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నారు. వాళ్లు ప్రతి నెలా కలుసుకునేవాళ్లు. దీంతో నాకు మొదటి నుంచి బ్రాహ్మణి, తేజస్విని నాకు మొదటి నుంచి తెలుసు. తర్వాత నేను ఇంజినీరింగ్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాను. తిరిగొచ్చాక.. నాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకున్నప్పుడు.. తేజస్వినిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. రెండు వైపులా ఆమెనే చొరవ తీసుకున్నారు. 23 ఏళ్లకే నాకు పెళ్లి కుదిరింది, 24 ఏళ్లకే పెళ్లయ్యింద’’ని భరత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలయ్యకు అల్లుణ్ని అయ్యాక.. ఆయనతో ఏవైనా విబేధాలు వస్తాయేమో అనుకున్నానన్న భరత్.. కానీ ఆయన్ను కలిసిన తర్వాత చాలా ఫ్రీ అయిపోయామన్నారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని.. ఓపెన్‌గా మాట్లాడతారన్నారు. పెళ్లయ్యాక తాను స్టాన్‌ఫోర్డులో ఎంబీఏ చేయగా.. తన భార్య కూడా శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిందన్నారు.