సాగర నగరం విశాఖపట్నానికి మరో విశిష్ట అతిథి వచ్చింది. ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఆదివారం వైజాగ్ పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది. విశాఖ ఇంటర్నేషనల్ టెర్మినల్‌కు వచ్చి తొలి అంతర్జాతీయ షిప్ ఇదే కావడం విశేషం. దీంతో నౌకాశ్రయ అధికారులు ఆ షిప్‌కు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ క్రూయిజ్‌గా "ది వరల్డ్" పేరొందింది. మరోవైపు ఏప్రిల్ 28వ తేదీన విశాఖకు చేరుకున్న ఈ నౌక.. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనుంది. అనంతరం ఏప్రిల్ 29వ రాత్రి ఇక్కడి నుంచి పోర్ట్ బ్లెయిర్ బయల్దేరి వెళ్లనుంది.
ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలని అనుకునే పర్యాటకులు ఎంతోమంది.. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించడం హాబీ. అమెరికాలో తన ప్రయాణం ప్రారంభించిన క్రూయిజ్.. అమెరికాతో పాటు, అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలను చుట్టేయనుంది. ఈ నౌకలో మొత్తం 80 మంది ప్రయాణీకులు విశాఖకు చేరుకున్నారు. వీరంతా ఆది, సోమవారాల్లో విశాఖ నగర అందాలను వీక్షించనున్నారు. తిరిగి ఈ నౌక సోమవారం రాత్రి వైజాగ్ హార్బర్ నుంచి పోర్టుబ్లెయిర్ బయలుదేరి వెళ్తుంది. ఈ భారీ షిప్‌ను చూసేందుకు వైజాగ్ ప్రజలు భారీగా తరలివచ్చారు. చూడటానికి ఓ భారీ భవంతిలా కనిపించే ఈ నౌక రాకతో సాగర నగరం మురిసిపోయింది.
ది వరల్డ్ క్రూయిజ్‌లో106 ఫ్లాట్‌లు, 19 స్టుడియో అపార్ట్‌మెంట్లు, 40 స్టుడియోలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 200 మంది వరకు ఉండొచ్చు. పెద్ద లాబీ, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్‌నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, కాక్‌టెయిల్ లాంజ్.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ షిప్‌లో ఏర్పాటు చేశారు. నౌక వివిధ నగరాలకు చేరుకున్న సమయంలో వీరంతా స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరిగి నౌకలోకి వెళ్లిపోతారు. అలా వీరి ప్రయాణం మొత్తం సముద్రం మీదే సాగిపోతూ ఉంటుంది.