ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయికి ఓ కుక్క అడ్డం పడింది. వైఎస్ జగన్.. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఆదివారం మలివిడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తాడిపత్రి సభ కోసం ఆదివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్.. తాడిపత్రికి బయల్దేరారు. ఇందుకోస తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న సమయంలో.. కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఈ ఘటనలో కుక్కకు గాయాలయ్యాయి. దీంతో సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కుక్కని హాస్పిటల్ తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు.
దీంతో గన్నవరం పోలీసులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శునకానికి చికిత్స అందించారు. ఆ తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన కుక్క పూర్తిగా కోలుకునేవరకూ జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ గన్నవరం పోలీసులకు సూచించారు. దీంతో ప్రస్తుతం ఆ కుక్క గన్నవరం పోలీసుల పర్యవేక్షణలోనే ఉంది. ఇక గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడి నుంచి తాడిపత్రి వెళ్లారు. తాడిపత్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
తాడిపత్రిలో సభలో వైఎస్ జగన్ .. విపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలన్నీ ఇంటివద్దకే వస్తున్నాయని చెప్పారు. వైద్యసేవలు, పింఛన్లు, రేషన్ సరుకులు ఇలా ప్రతి సంక్షేమ లబ్ధి.. ఇంటి వద్దకే వస్తోందన్న జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ ఇంటికే చేరేలా కొత్త వ్మవస్థ తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏపీలో మరో 15 ఏళ్లపాటు వైసీపీ పాలన కొనసాగాలని ఆకాంక్షించిన జగన్.. ఐదేళ్లలోనే ఇలాంటి మార్పులు జరిగాయని.. 15 ఏళ్లపాటు మన ప్రభుత్వం ఉంటే మరెన్ని మార్పులు జరుగుతాయో ఆలోచించమని సూచించారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు పేరు చెప్పితే.. ఒక్క మంచి పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించిన వైఎస్ జగన్.. చంద్రబాబుకు అధికారం కట్టబెడితే ఉన్న సంక్షేమ పథకాలను ఆపేస్తారని హెచ్చరించారు.చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటుగా పేద ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచేలా వైసీపీ పాలన సాగిందన్న జగన్.. మరోసారి తమను ఆశీర్వదించాలని కోరారు.