ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే దీనికి కారణం. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే జనసేనానిని ఓడించేందుకు వైఎస్సార్సీపీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. పిఠాపురం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నాయో.. అంతకు మించి బోలెడన్ని రెట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ నేత వర్మ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరతానేది ఒకటి కాగా.. వంగా గీత నామినేషన్ వెనక్కి తీసుకుంటారనేది రెండోది.
పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంచి బలమున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఆయన ఓడారు. 2024లో టీడీపీ నుంచి వర్మనే పోటీ చేస్తారని భావించారంతా. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడం, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ సైడ్ అయ్యారు. వర్మ అనుచరులు ఆందోళనలు జరిపినప్పటికీ.. చంద్రబాబు పిలిచి మాట్లాడటం, ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ తరఫున ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు.
ఇటీవలే వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ ఈజీగా గెలుస్తారని.. తన వర్గం, టీడీపీ కార్యకర్తలు ఆయనకు పూర్తి మద్దతునిస్తున్నారని చెప్పారు. అయితే వర్మ వైఎస్సార్సీపీలోకి వెళ్తారనే సమాచారం తమ దగ్గర ఉందని.. క్రెడిబుల్ సోర్సుల నుంచే తమకు ఈ సమాచారం వచ్చిందని ఓ మీడియా ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటేటర్ చెప్పడంతో.. వర్మ వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.
వాస్తవానికి వర్మ మొదటి నుంచి టీడీపీతోనే ఉన్నారు. 2014లో తనకు టికెట్ దక్కనప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. అప్పుడే ఆయన పార్టీ మారలేదు. అలాంటిది ఇప్పుడు పార్టీ మారుతారని అనుకోలేం. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఒకవేళ మారేది ఉండుంటే.. నామినేషన్ల ప్రక్రియ ముగియక ముందే ఈ ప్రచారం జరిగి ఉండుంటే.. వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారని అనుకోవచ్చు. కానీ నామినేషన్ల గడువు ముగిశాక.. వర్మ పార్టీ మారినా ఆయనకు ఒరిగేదేం ఉండదు. ఒకవేళ ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నిజమైతే మాత్రం.. అది జనసేనానికి, టీడీపీకి గట్టి దెబ్బే అవుతుంది. కానీ ఆయన అంత గుడ్డిగా పార్టీ మారుతారని అనుకోలేం. మెగా హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వర్మ తనయుడు గిరీశ్ పాల్గొన్నారు. అంతే కాదు వర్మ కూడా పవన్ కళ్యాణ్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వర్మ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలుపెట్టడంతో.. టీడీపీ-జనసేన కూటమి సైతం దానికి ధీటైన ప్రచారాన్ని ప్రారంభించింది. అదేంటంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత తన నామినేషన్ వెనక్కి తీసుకుంటారట. ‘మే 1న శ్రామికుల దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వంగా గీతతో పాటు మరి కొందరు వైసీపీ నాయకులు జనసేన పార్టి కండువ కప్పుకొనున్నారు’ అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి వైసీపీలో చీలికలే కారణమని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని వంగా గీత ఖండించారు. ఆమె ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు.