ఏపీలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు. అనుమానం వచ్చిన ప్రతి చోటా గాలిస్తున్నారు. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అడ్డుకోవటమే లక్ష్యంగా స్థానిక పోలీసులతో పాటుగా ఎన్నికల సంఘం నియమించిన ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు సైతం ముమ్మురంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలోని భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు సోదాలు నిర్వహించగా.. భారీ మొత్తంలో గోవా మద్యం బయటపడింది.
గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి చెందిన మామిడితోటలోని ఓ ఇంట్లో మద్యం దాచినట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో తనిఖీలు నిర్వహించగా.. సుమారుగా 12వందల 10 బాక్సులలో ఉంచిన విస్కీ బాటిళ్లను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం 58,080 విస్కీ బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 75 లక్షల 50 వేలు రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి మామిడితోట యజమాని దుర్గాప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మామిడితోట వాచ్‌మెన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో గోవా మద్యాన్ని నిల్వ చేయడం వెనుకున్న కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎక్కడి నుంచి ఈ మద్యం తీసుకువచ్చారు, ఎవరు తెచ్చారు, ఎవరి కోసం తీసుకువచ్చారనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థానిక కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించామన్న పోలీసులు.. మొత్తం మద్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ స్థాయిలో మద్యం దొరకడం స్థానికంగా కలకలం రేపింది.