టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో ఆయన శనివారం పర్యటించారు.. గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని.. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు. గతంలో తాను వైఎస్సార్‌సీపీ వాళ్ల దగ్గరకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించిందన్నారు. వెంటనే బయటకు వచ్చేశానన్నారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఓటు సద్వినియోగం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రాచరికం తరహా పాలన సాగుతోందని.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.