ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ చల్లటివార్త చెప్పింది. వచ్చే మూడురోజులు ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైన ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాంలలో రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో ఉత్తరకోస్తాలో ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఆదివారం, సోమవారం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు.
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత
మరోవైపు శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ ఏడాది నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని చెప్పారు. అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 77 మండలాల్లో తీవ్రవడగాల్పులు,98 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఆదివారం కూడా 58మండలాల్లో తీవ్రవడగాల్పులు,148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు,111వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.