ఏదైనా నేరం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. అయితే జైలులో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. సాధారణంగా జైలులోకి వెళ్లడం అంటే బెయిల్ లేదా నిర్దోషిగా లేదా శిక్ష పూర్తయిన తర్వాతే వస్తారు. పారిపోదాం అని ప్రయత్నం చేసినా.. వెళ్లలేకుండా ఉండే ఎత్తైన, భారీ ప్రహరీ గోడలు ఉంటాయి. అయితే అలాంటి జైలు నుంచి ఏకంగా 118 మంది ఖైదీలు పారిపోయారు. దీంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న ఖైదీలను పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ సంఘటన నైజీరియా దేశంలో చోటు చేసుకుంది.
నైజీరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియా రాజధాని అబూజ సమీపంలోని సులేజా ప్రాంతంలో ఉన్న జైలు భారీ వర్షాలకు దెబ్బతిన్నది. దీంతో ఆ జైలు ప్రహరీ గోడ బుధవారం రాత్రి కూలిపోయింది. ప్రహరీ గోడతోపాటు జైలు ఆవరణలో ఉన్న మరికొన్ని భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఇదే అదనుగా భావించిన ఆ జైలులోని ఖైదీలు.. బయటికి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ జైలులో ఉన్న 118 మంది ఖైదీలు పరారైనట్లు జైలు అధికారులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 10 మంది ఖైదీలను మాత్రమే పట్టుకున్నట్లు చెప్పారు. మిగిలినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. అయితే ఎవరెవరు తప్పించుకున్నవారు అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. గతంలో ఇదే జైలులో బోకో హరమ్ గ్రూప్ సభ్యులను కూడా బంధించగా.. పారిపోయిన వారిలో వారు కూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడంతో ఆయా కేసుల్లో బాధితులుగా ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మరోవైపు.. నైజీరియా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం గతంలో కూడా చాలా సార్లు జరిగింది. ఉగ్రవాదుల దాడులు, వసతుల లేమి కారణంగా ఈ మధ్యకాలంలో నైజీరియా దేశంలోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయిన సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. 2022 జూలైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే అబూజా జైలు నుంచి సుమారు 600 మంది ఇస్లామిక్ స్టేట్ ఖైదీలు పరారీ కావడం పెను సంచలనంగా మారింది. అయితే అందులో 300 మందిని పోలీసులు తిరిగి పట్టుకోగా.. మరో 300 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు.