అపార్ట్‌మెంట్ నాలుగో ఫ్లోర్ నుంచి అనుకోకుండా అమ్మ చంకలోని చిన్నారి జారిపోయి.. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడింది. మెల్ల మెల్లగా కిందకు జారిపోసాగింది. దీంతో ఆ చిన్నారిని కాపాడేందుకు అపార్ట్‌మెంట్ వాసులు ప్రయత్నించారు. ఆ చిన్నారి జారిపోతే ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు కొందరు కింద బెడ్‌షీట్‌లు పరిచి నిలబడ్డారు. మరికొందరు మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి ఆ పిల్లాడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఒకాయన ఆ పసివాడ్ని ఒడుపుగా పట్టుకొని కిందకు దించడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధఇంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగర శివార్లలోని అవడి ప్రాంతంలోని వీజీఎన్ స్టాఫర్డ్ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఆ అపార్ట్‌మెంట్ భవనం నాలుగో అంతస్తులో నివసించే ఓ మహిళ ఏడు నెలల వయసున్న తన కుమారుడ్ని ఎత్తుకుంది. ఆ చిన్నారిని చంకలో ఉంచుకొని.. ఇల్లు ఊడ్చే కర్ర తేవడం కోసం బాల్కనీలోకి వెళ్లింది. ఈ సమయంలో అనుకోకుండా ఆ పిల్లాడు తల్లి చేతుల్లో నుంచి జారిపోయి.. కింద ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడ్డాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చారు.
ఈ సమయంలో రేకులపై చిన్నారి పడి ఉన్న విషయాన్ని గుర్తించారు. కొద్ది కొద్దిగా కిందకు జారుతూ ఉండటంతో అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. ఆ పిల్లాడిని కాపాడటం కోసం రంగంలోకి దిగారు. కొందరు కింద దుప్పట్లను పరిచి నిలబడగా.. మరికొందరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వెళ్లి ఆ పిల్లాడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఒకాయన ఒడుపుగా ఆ చిన్నారిని పట్టుకొని కిందకు దించాడు. చిన్నారి సురక్షితంగా ఉండటంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, చిన్నారి బాల్కనీపై ఉన్నంతసేపు అందరూ ఊపిరిబిగబట్టి ఉండిపోయారు.