ఆస్తి కోసం కన్నతండ్రిపైనే దాడిచేసిన కుమారుడు.. చివరకూ ఆయన మరణానికి కారకుడయ్యాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆ తండ్రి కన్నుమూశారు. తమిళనాడులోని పెరంబలూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కూర్చుని ఉన్న తండ్రిపై విచక్షణారహితంగా పిడిగుద్దులు, ముష్టిఘాతులు కురిపించాడు దుర్మార్గుడు. దెబ్బలకు విలవిలలాడిపోయిన ఆ తండ్రి.. అక్కడే కూలబడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చించగా.. రెండు నెలలుగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గత గురువారం (ఏప్రిల్ 25న) కొడుకును అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే పెరంబలూరుకు చెందిన అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని కులంతైవేలు (63)పై ఆయన కుమారుడు సంతోష్ (40) ఆస్తి కోసం దాడిచేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకోగా.. రెండు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడ్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమై.. ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు. అయితే, కొడుకు కొట్టిన దెబ్బలతోనే కులందైవేలుకు తీవ్రగాయాలైనట్టు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతోష్ తన తండ్రిని దారుణంగా కొడుతున్న వీడియో బయటపడింది. తండ్రిపై దాడిచేసిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్ధిపై దాడిచేసినట్టు అదేపనిగా పిడుగుద్దులు కురిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమైండ్‌కు తరలించారు. పెరంబలూరు డీఎస్పీ శ్వామలాదేవి మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 18న కులంతైవేలు చనిపోయాడు.. తొలుత కుటుంబసభ్యుల నుంచి సంతోష్‌పై ఎటువంటి ఫిర్యాదు రాలేదు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడ్ని అరెస్ట్ చేశారు.. దాడికి, కులందైవేలు మృతికి గల సంబంధాలపై విచారణ చేపట్టాం.. ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది’ అని అన్నారు.
అయితే, గతంలోనే కుమారుడు సంతోష్‌పై కులంతైవేలు పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత దానిని స్థానిక ఎస్ఐ ఒత్తిడి వెనక్కి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇది నాన్ బెయిలబుల్ నేరమని, మృతుడు కులంతైవేలు ఫిర్యాదును ఉపసంహరించుకోవడంపై ఉన్నతాధికారులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఎస్ఐ నిర్ణయం తీసుకున్నారని మరో అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఆస్తి కోసం కన్న తండ్రినే చంపడానికి సిద్దమయ్యాడని పోలీసులు తెలిపారు.