దేశం కోసం సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టే సైనికులు.. ఆపదొస్తే మేమున్నామంటారు. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. భారత్‌లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ్ బెంగాల్ నాడియా జిల్లాలో గురువారం రాత్రి మహబుల్ మండల్ (72) అనే వ్యక్తి వయోభారంతో కన్నుమూశాడు. అతడి కూమర్తె, ఇతర బంధువులు బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్నారు. దీంతో తన తండ్రిని చివరిసారి చూసే అవకాశం కల్పించాలని కోరుతూ మండల్ బంధువు బీఎస్‌ఎఫ్ అధికారులను అభ్యర్ధించారు.
ఈ విన్నపంపై స్పందించిన బీఎస్‌ఎఫ్ 4వ బెటాలియన్ అధికారులు.. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆ మహిళ, ఇతర కుటుంబ సభ్యులను భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన జీరో లైన్ వద్ద కడసారి చూపు చూసేందుకు అనుమతించారు. ఇరుదేశాల జవాన్ల సమక్షంలో మృతదేహాన్ని అంతర్జాతీయ సరిహద్దుకు తరలించారు. తన తండ్రిని చివరిసారి చూసిన ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం బీఎస్‌ఎఫ్ అధికారులకు కృతజ్ఞత తెలిపారు.
మృతుడి కుమారుడు మార్తక్ మాండల్ మాట్లాడుతూ.. ‘సమయం లేకపోవడంతో తన సోదరి, ఇతర బంధువులు పాస్‌పోర్ట్‌లు, వీసాతో దేశంలోని రావడం సాధ్యం కాలేదు.. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చాం.. చివరగా నేను మా నాన్న మృతదేహాన్ని సరిహద్దులోని జీరో పాయింట్‌కి తీసుకెళ్లాను.. అక్కడ మా సోదరితో పాటు బంధువులు చివరిసారిగా చూసి కన్నీటి వీడ్కోలు పలికారు.. బీఎస్ఎఫ్ చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.
ఈ ఘటనపై స్పందించిన బీఎస్‌ఎఫ్ పీఆర్‌ఓ, దక్షిణ బెంగాల్ సరిహద్దుల డీఐజీ ఏకే ఆర్య.. సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాసే బీఎస్‌ఎఫ్ ఎల్లప్పుడూ మానవత్వం, మానవతా విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంతేకాదు, సరిహద్దుల్లోని ప్రజల మానవత, సామాజిక సంక్షేమం కోసం ఆలోచిస్తుందని తెలిపారు.