నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులకు ముఖ్యగమనిక. శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఆలయ ఆవరణతో పాటుగా శ్రీశైలం పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను విక్రయించకూడదన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా మట్టి, స్టీల్, రాగి, గాజు బాటిల్స్‌ను మంచి నీళ్ల కోసం ఉపయోగించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఈవో తెలిపారు. వాస్తవానికి గతేడాది నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని.. ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని.. అందరూ సహకరించాలని కోరారు.
పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షకులు అయ్యన్న దేవస్థానం చెక్‌పోస్టు దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను శుభ్రం చేశారు. శ్రీశైలంకు వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేశారు.. ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకురాకుండా కట్టడి చేస్తున్నారు. శ్రీశైంలో ఇకపై ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ సంచులు, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు కూడా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని.. ప్రతి రోజు తనిఖీలు చేపడతామని.. అప్పటికి మార్పు రాకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. భక్తులు, వ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులు, సత్రాల నిర్వాహించేవారు ఈ విషయాన్ని గమనించి.. సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. తిరుమలతో పాటుగా పలు దేవాలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి.. అక్కడే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు కొండపైకి రాకుండా చూస్తున్నారు. ఒకవేళ వాహనాల్లో ప్లాస్టిక్ వస్తువులు ఉంటే అక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు తిరుమల తరహాలోనే శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa