ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇంతకాలం రాయలసీమ జిల్లాల్లోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ నెల 4 నుంచి 7వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ అంచనా ఉంది.
మరోవైపు రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయగా.. 118 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో ఏకంగా 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 45.7 డిగ్రీలు.. నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6 డిగ్రీలు.. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుని, నందిగామ, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa