ప్రజలను ఇబ్బందికి గురి చేసి ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. పెన్షనర్లలను వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కుటిల బుద్ధితో వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్తో ఎన్నికలు జరిపించాలన్నారు. రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలని ఈసీ చెప్పిందని.. అందులో పులివెందుల, కుప్పం లేవన్నారు. కుప్పంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కుప్పంలో వైసీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులే కాకుండా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ వినతి చేశారు.