జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పవన్ కళ్యాణ్ అవగాహనలేకుండా.. ఊగుతూ మాట్లాడం ఏమిటి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలను ఎందుకు పట్టించుకోవాలన్నారు. ఆయన మాట్లాడే భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ఇటువంటి వ్యాఖ్యలను ఎవరైనా హర్షిస్తారా అని మండిపడ్డారు. ఆయన భాష ఏంటి, ఆయన హావభావాలు ఏంటని అడిగారు. పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రతిపక్ష నాయకుడా అని నిలదీశారు. ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారన్నారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజాభిప్రాయ సేకరణ జరగవలసి ఉందని... ఆ తర్వాతే చట్టం అవుతుందని తెలిపారు. దీనిపై కొన్ని పేపర్స్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని ఖండిస్తున్నామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేస్తామంటున్నారని.. ముందు అధికారంలోకి రావాలి కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని చెప్పట్లేదని.. ఎన్నిసార్లు పెంచారో తనకైతే నిజంగా తెలియదన్నారు. తెలంగాణలో తమ కుమారుడు రెండున్నర ఎకరాలు భూమి కొన్నారని.. ఈ అంశంపై విచారణ జరుగుతుందని.. అందుకు తాము సహకరించామని తెలిపారు. ఇందులో వివాదాంశం ఏముందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేశారన్నారు. కొంతమంది నియోజవర్గాల పరిధిలో వారి మేనిఫెస్టోను వారు విడుదల చేసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.