విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్‌తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు. అనంతరం 35వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి, నాగుల్ మీరా పాల్గొన్నారు. తాగు నీరు, డ్రైనేజీ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుజనాకు స్థానిక ప్రజలు వివరించారు. తాను గెలిచిన వెంటనే యుద్ద ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించి.. దుర్వాసన లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ వారు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం మొత్తం తిరిగానని... ప్రజలు ఎక్కడా కూడా వారు బాగా చేశారని చెప్పిన వాళ్లే కనిపించలేదన్నారు. మీడియా ముందుకు వచ్చి గొప్పగా చేశామని చెప్పడమే కానీ.. వారు చేసింది ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. ఉన్న చెట్లను కూడా నరికి.. చిరు వ్యాపారాలకు నిలువ నీడ కూడా లేకుండా చేశారన్నారు.