తాతలు, తండ్రుల నుంచి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన మన భూములపై హక్కు మనకే ఉండాలిగా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. మన పట్టాదారు పాసు పుస్తకాలపై మనవి కాకుండా, జగన్‌దో, మరొకరిదో ఫోటో ఉంటే సహిస్తామా అంటున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ చట్టం కింద ఇచ్చిన పత్రాలను, పాసుపుస్తకాలను చింపి చెత్తబుట్టలో విసిరేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. పోలింగ్‌కు మరో పది రోజులు మాత్రమే ఉన్న వేళ ఏపీలో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ మరోసారి స్పందించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం (మే 4) అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ‘31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్‌కు ఇవ్వడమే తప్ప, భూములు లాక్కోవడం తెలియదు. చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు. చంద్రబాబు మోసపు మాటల నమ్మొద్దు’ అని జగన్ అన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడికి తెలుసా? అని ప్రశ్నించిన వైఎస్ జగన్.. భూములపై ప్రజలకు సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెలిపారు. ఇదో పెద్ద సంస్కరణ కాబోతోందిని చెప్పారు. ఎలాంటి వివాదంలేదని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం అని సీఎం జగన్ వివరించారు. వందేళ్ల తర్వాత మళ్లీ భూసర్వే చేయించి, సరిహద్దు రాళ్లు పెట్టిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తైందని జగన్ తెలిపారు. కార్డు 2 విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. భూ హక్కుదారులకు పత్రాలు కూడా అందజేశామని చెప్పారు.