కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కోర్కెలు కోరుకుంటూ ఉంటారు. అలా కోరిన కోరికలు నెరవేరితే.. మరోసారి ఆ కోదండరాముణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి విరాళం సమర్పించుకుని శ్రీవారిపై భక్తిభావాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా టీటీడీకి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని టీటీడీకి విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు తిరుమలలో మే ఆరోతేదీ పదోవిడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో భాగంగా అయోధ్యకాండలోని శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 189 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేద పండితులు పాల్గొంటారు.
కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
మరోవైపు తిరుపతిలో కొలువైన కోదండరామస్వామి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 8వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్త్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు విహరిస్తారు. మే 11, 18, 25వ తేదీల్లో శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం ఆరుగంటలకు సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. మే 11న పుష్పయాగానికి అంకురార్పణ, మే 12న పుష్పయాగం నిర్వహిస్తారు. ఇక మే 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.