సాగరతీర నగరం విశాఖపట్నానికి ప్రత్యేక స్థానం ఉంది.. పర్యాటక ప్రాంతంగా, ప్రశాంతమైన నగరంగా.. ఐటీ, ఫార్మా హబ్‌గా గుర్తింపు పొందింది. విశాఖకు ఘనమైన చరిత్ర ఉంది.. చిన్న కుగ్రామంగా మొదలై.. ఆ తర్వాత నియోజకవర్గంగా మారి.. ఇప్పుడు ఆ నియోజకవర్గాల సంఖ్య ఏకంగా ఏడుకు చేరింది. విశాఖ ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా చెబుతుంటారు. దాదాపు 80 ఏళ్లలో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా నగరం బాగా విస్తరించింది.. అభివృద్ధి సాధించింది. విశాఖ రాజకీయ ప్రస్థానం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
స్వాతంత్ర్యం తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం మొత్తం కలిపి ఒకే నియోజకవర్గంగా ఉండేదంటే నమ్మగలరా.. అవును మీరు వింటున్నది నిజమే. దేశంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగితే.. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు సంఖ్య కేవలం 68వేల 282మంది మాత్రమే. 1952 మార్చి 27న ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో విశాఖ అసెంబ్లీ నుంచి ప్రముఖ నేత తెన్నేటి విశ్వనాథం తొలి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం విశాఖపట్నం మరింత విస్తరించింది.
1955 మధ్యంతర ఎన్నికలలో విశాఖపట్నంతో పాటుగా కణితి (కణిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాతం) కేంద్రంగా రెండో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. దీంతో విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 58,132 మందికి తగ్గడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయడంతో.. విశాఖ క్రమసంఖ్య 23 అయ్యింది. తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల నంబరులో విశాఖ అసెంబ్లీ క్రమసంఖ్య 19గా ఉండేది. ఆ తర్వాత 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ అసెంబ్లీ ఓటర్ల సంఖ్య 71,794కు పెరిగింది.
అప్పటి నుంచి విశాఖపట్నంలో జనాభా పెరుగుతూ వచ్చింది. 1967 ఎన్నికల సమయానికి కణితి అసెంబ్లీని రద్దుచేసి విశాఖ-1, విశాఖ -2 రెండు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఈ నియోజకవర్గాలు 2004 వరకు కొనసాగగా.. విశాఖ-1లో లక్షా 27వేల44, విశాఖ-2లో 4లక్షల 3వేల 262కు ఓటర్ల సంఖ్య పెరిగింది. అనంతరం విశాఖపట్నం పరిధి మరింతగా పెరిగింది. నియోజకవర్గాల పునరవ్యవస్థీకరణలో భాగంగా.. 2009లో విశాఖ దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలు నగర పరిధిలో ఉన్నాయి. పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రాంతాలు నగర పరిధిలోనివే ఉన్నాయి.
చిన్న గ్రామంగా మొదలై.. మెల్లిగా విశాఖ విస్తరించింది.. నగరంలో ఏకంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, శివారులో మరో రెండు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి.. అంటే మొత్తం ఏడు నియోజకవర్గాలు. విశాఖ నగర ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 17 లక్షలకు చేరగా.. జిల్లా ఓటర్ల సంఖ్య 20 లక్షలకుపైగానే ఉంది. ప్రారంభంలో కేవలం 68 వేల ఓటర్ల నుంచి విశాఖ 20 లక్షల ఓటర్లకు విస్తరించింది. విశాఖ ఇప్పుడు బెస్ట్ సిటీగా మారింది.. ఇంకా గొప్పగా అభివృద్ధి అయ్యే దిశగా పరుగులు పెడుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు తెలుగు దేశం పార్టీ గెలవగా.. మూడు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. అంతేకాదు జగన్ సర్కార్ విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని వైఎస్సార్‌సీపీ, తిరిగి పుంజుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్నాయి.